telangana
చిన్నారి ప్రాణం తీసిన ఎలక్ట్రిక్ కాంటా
మేజర్ న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా రాజరాంపల్లె గ్రామంలో తీవ్ర శోకస్రాంద్రాన్ని నింపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటాను పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురై పది నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది.
తల్లిదండ్రులు ఎలక్ట్రిక్ కాంటాను చార్జింగ్‌లో పెట్టి తమ దైనందిన పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆ చిన్నారి పాకుకుంటూ వెళ్లి దానిని ముట్టుకుంది. ఆ సమయంలో కాంటా నుంచి ఒక్కసారిగా విద్యుత్ ప్రసరించడంతో పాప తీవ్రంగా విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో కన్నతల్లి ఆక్రందనలు మిన్నంటాయి. కనురెప్పపాటు నిర్లక్ష్యం ఎంతటి పెద్ద మూల్యానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ప్రస్తుత ఆధునిక కాలంలో వృత్తిపరమైన పరికరాలు, నిత్యం వాడే పనిముట్లు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలోకి మారిపోయాయి. సులభమైన వినియోగం కోసం మనం వీటిని వాడుతున్నప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవి ఎంతటి ప్రాణాంతకంగా మారతాయో ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా ఇళ్లల్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యుత్ సాధనాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.