telangana
చేనేత వస్త్రాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణ
సూర్య మాక్లూర్ : చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు చేనేత కార్మికులకు అండగా నిలవాలని చిన్నాపూర్ గ్రామ సర్పంచ్ చిన్న గంగాధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్మూర్ చేనేత పారిశ్రామిక సహకార సంఘాన్ని సందర్శించి, వివిధ రకాల చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతి మగ్గాల తయారీతో కాలుష్యం తగ్గుతుందని, చేనేత వస్త్రాల వినియోగం కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని అన్నారు. గాంధీజీ చూపిన ఖాదీ మార్గంలో ప్రతి ఒక్కరూ చేనేతను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం సంఘం అధ్యక్షుడు చెన్న రవికుమార్ చేనేత శాలువాతో గంగాధర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డిజైనర్ సత్యనారాయణ, బేతు జనార్ధన్, చేనేత కార్మికులు పాల్గొన్నారు.