బోర్లపై ఆంక్షలు ఎందుకు..? బీఆర్ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజల నీటి అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ నీటి వనరులను సమకూర్చకుండా, ఓఆర్ఆర్ పరిధిలో బోర్ల ఏర్పాటుపై ఆంక్షలు విధించడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి విమర్శించారు. ముందుగా ప్రజలకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా అందించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన తర్వాతే బోర్లపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు అధికారులు సరైన సలహాలు ఇవ్వకుండా తప్పుడు నిర్ణయాలకు ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏవీ రంగనాథ్ వంటి అధికారులు మీడియా ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యతను ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా ఇవ్వాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ముందుగా వారి నీటి అవసరాలను అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 1.20 కోట్ల జనాభా ఉందని, ఒక్కొక్కరికి రోజుకు 150 లీటర్ల నీటి చొప్పున అందించాలంటే భారీ స్థాయిలో నీటి వనరులు అవసరమని పేర్కొన్నారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ నీటి నిల్వ, సరఫరా సామర్థ్యాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నగర పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ఇతర జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకురావడానికి అయ్యే పంపింగ్, రవాణా, నిర్వహణ ఖర్చులను ఎవరు భరిస్తారని ప్రశ్నించారు.
ప్రత్యామ్నాయ నీటి వనరులను అందుబాటులోకి తీసుకురాకుండా ప్రజలు వినియోగిస్తున్న బోర్లను అడ్డుకోవడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వ సామర్థ్యాన్ని కనీసం 50 శాతం పెంచాలని, ప్రస్తుత సరఫరా సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా కల్పించకుండా ఓఆర్ఆర్ పరిధిలో నీటి వనరుల వినియోగంపై ఆంక్షలు విధించే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎడ్ల సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాలను పునఃసమీక్షించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమగ్ర నీటి సరఫరా ప్రణాళికను అమలు చేయాలని కోరారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.