telangana
బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో నీటి కష్టాలు..* *కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి
Telangana
17 Nov 2026
27 views
దుండిగల్ మేజర్ న్యూస్ :బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. 295 బౌరంపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పిసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ప్రజావాణిలో పాల్గొని పాఠశాలలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గండిమైసమ్మ–దుండిగల్ మండలం బౌరంపేట్ గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా భారీగా పెరిగిందని నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఒకే భవనంలో ప్రైమరీ స్కూల్, హైస్కూల్‌తో పాటు అంగన్‌వాడీ కేంద్రం కూడా కొనసాగుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పాఠశాలకు భవనం, స్థలం సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని గతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ విజ్ఞప్తి మేరకు కలెక్టర్ నుంచి మండల అధికారులకు సూచనలు వెళ్లినా ఇప్పటివరకు స్థలం కేటాయింపు జరగలేదని తెలిపారు. మరోవైపు పాఠశాలలో నీటి సమస్య మరింత తీవ్రంగా మారిందని నాయకులు వివరించారు. సుమారు 900 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో తాగునీటితో పాటు వాష్‌రూమ్‌లను శుభ్రం చేసేందుకు అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రెండేళ్ల క్రితం ఎంపీ నిధులతో బోరు మంజూరు చేసి ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరు నుంచి నీరు రావడం లేదని తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక జలమండలి, మున్సిపల్ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు సరైన స్పందన లభించలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా కొందరు కలిసి సొంత నిధులతో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని, పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ ద్వారా ప్రతిరోజూ ఒక వాటర్ ట్యాంకర్‌ను పంపించాలని కలెక్టర్‌ను కోరారు. అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలో కనీస తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం ఆందోళనకరమని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి. ప్రభాకర్ రెడ్డి, ఎంబరి ఆంజనేయులు, కుమ్మరి మల్లేష్, పాఠశాల చైర్మన్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నార
ట్యాగ్లు:
Latest News