*అయిజ మండలంలో ముమ్మరంగా 'క్షేత్ బచావో అభియాన్'*
ఐజ సూర్య న్యూస్_: చిన్న తాండ్రపాడు, ఉప్పల్ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన రసాయన ఎరువుల మోతాదును తగ్గించడం, నేల సారాన్ని కాపాడుకోవడం, పంట అవశేషాలు కాల్చకపోవడంపై రైతన్నలకు అధికారుల దిశానిర్ధేశం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'క్షేత్ బచావో అభియాన్' (భూమిని రక్షించుకుందాం) కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండలంలోని చిన్న తాండ్రపాడు మరియు ఉప్పల్ గ్రామాలలో వరుసగా ప్రత్యేక రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జగ్గు నాయక్ అధ్యక్షత వహించగా, అలంపూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు జి. శివనాగి రెడ్డి, అయిజ మండల వ్యవసాయ అధికారి కె. జనార్దన్, ఉప్పల్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి అరవింద్ కుమార్ తదితర అధికారుల బృందం పాల్గొని రైతులకు అమూల్యమైన సూచనలు అందించింది. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో అధికారులందరూ రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. సాగు భూమిని ప్రతి ఒక్క రైతు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ప్రస్తుత కాలంలో రసాయన ఎరువులు, పురుగుమందుల అతి వాడకం వల్ల నేల తన సహజ సారాన్ని కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, భూసార పరీక్షలు నిర్వహించుకుని సిఫారసు చేసిన మేరకే ఎరువులను వాడాలని సూచించారు. అంతేకాకుండా, వానాకాలంలో పంటల సాగు అనంతరం మిగిలిన పంట అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగలబెట్టకూడదని రైతులను హెచ్చరించారు. ఆ అవశేషాలను నేలలోనే కలియదున్నడం వల్ల లేదా పశువుల మేతగా ఉపయోగించడం ద్వారా నేలకు మేలు జరుగుతుందని వివరించారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు నశించడంతో పాటు పర్యావరణం కలుషితమవుతుందని తెలిపారు. ఇవేకాకుండా పంట సాగులో మల్చింగ్ పద్ధతులు పాటించడం, నేలలో తేమను సంరక్షించే యాజమాన్య పద్ధతులు సమర్థవంతమైన కలుపు నివారణ చర్యలపై కూడా రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు అందించారు. ఈ రెండు గ్రామాల సదస్సులలోనూ ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన సదస్సులను విజయవంతం చేశారు.
ఐజ మండలం సూర్య రిపోర్టర్ వి ఆనందరాజు