అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా!
అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా!
* తుర్కయంజాల్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
* ఫిర్యాదులు అందినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి!
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాగన్నగూడ సాగర్ హైవేపై బావర్చి హోటల్ ఎదురుగా, అలాగే కమ్మగూడ ఏపీఏటీ కాలనీలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవడం లేదని, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భవన నిర్మాణాలకు ఒకరకమైన అనుమతులు తీసుకుంటూ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, భారీ కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల పరిశీలన, నిర్మాణాల పర్యవేక్షణ చేయాల్సిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు అందిన తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ఆవేదన: అక్రమ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు, డ్రైనేజీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించడం లేదని, నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సామాన్యులు చిన్న నిర్మాణం చేపడితే అనుమతుల పేరుతో ఇబ్బందులు పెట్టే అధికారులు, భారీ నిర్మాణాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఆదిభట్ల డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి : డివిజన్ పరిధిలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపడతాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం కూల్చివేతతో సహా తగిన చర్యలు తీసుకుంటాం. టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశిస్తాం.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి! రాగన్నగూడ సాగర్ హైవే, ఏపీఏటీ కాలనీలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, అనుమతులు, వాస్తవ నిర్మాణాలను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో పాటు బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపైనా విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.