నిబంధనలకు విరుద్ధమైన బాణాసంచా దుకాణాలను మూసివేయాలి
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను వెంటనే మూసివేయాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నాగేంద్ర డిమాండ్ చేశారు. నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారుల సమీపంలో ప్రమాదకరంగా దుకాణాలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఈ మేరకు సోమవారం వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దుకాణాలపైకప్పులకు మండే స్వభావం కలిగిన తార్పాలిన్లు ఉపయోగించడం, నాసిరకం బాణాసంచా విక్రయాలు, పాత నిల్వలు, అధిక ధరల వసూళ్లపై విచారణ జరిపించాలని కోరారు. అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల కార్యాలయాల ముట్టడి, భారీ ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు వెంకటేష్ రవి, మాల మహానాడు నాయకులు రాజులప్ప, తిమ్మన్న, గోవిందుర్లు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా