అంగన్వాడీ సిబ్బందిపై వేధింపులు
*--మూడేళ్లుగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదు.*
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన అంగన్వాడీ సిబ్బందిని అదే గ్రామానికి చెందిన తాన్యం సత్యనారాయణ అనే వ్యక్తి గత మూడేళ్లుగా వృత్తిపరంగా,వ్యక్తిగతంగా వేధిస్తూ బహిరంగంగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పాశం విజయలక్ష్మి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.విజయలక్ష్మితో పాటు అదే గ్రామంలో అంగన్వాడీ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మంజుల,అరుణాదేవి,శోభారాణి,అంగన్వాడీ ఆయమ్మలను సైతం సదరు వ్యక్తి పలుమార్లు అవమానకరంగా దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.అంతేకాకుండా సత్యనారాయణ కలెక్టర్‌కు అంగన్వాడీ ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పటికీ,ఆయన తమను దూషించడం, ఇబ్బందులకు గురిచేయడం మాత్రం మానడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.గత నెల 15వ తేదీన అంగన్వాడీ సిబ్బంది నలుగురు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలో సత్యనారాయణ అడ్డగించి అసభ్య పదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో వివరించారు.తమ విధులకు ఆటంకం కలిగిస్తూ,ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ సందర్భంగా ఎస్సై నరేందర్ మాట్లాడుతూ..అంగన్వాడీ సిబ్బంది మంగళవారం ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని,ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.