అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా
జిన్నారం :బొల్లారం డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం శ్రీరామ్‌నగర్, వై ఎస్ ఆర్ కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న రెండు నిర్మాణాలను గుర్తించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కాలనీల్లో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలకు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించి, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని, అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్ ఐ లు శ్రీనివాస్,యాదయ్య హెచ్చరించారు. ప్రజలు ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణాలు చేపట్టే ముందు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు. పట్టణ ప్రణాళిక నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించవద్దని అధికారులు స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై తనిఖీలు కొనసాగిస్తూ, నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, యాదయ్య, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వినయ్, స్థానికులు పాల్గొన్నారు.