ఆధునిక సాగు మెళకువల కోసం.. మెగా రైతు మేళాకు రైతుల పయనం
కోడంగల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రైతు మేళాకు పెద్దకొత్తపల్లి మండలంలోని వెన్నచర్ల, నక్కలపల్లి గ్రామాల రైతులు సోమవారం బయలుదేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ మేళాకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ సూచనతో గ్రామ ఏఈఓ ఎండీ పరీద్ ఆధ్వర్యంలో రైతులు తరలివెళ్లారు.ఈ సందర్భంగా నక్కలపల్లి సర్పంచ్ మొట్టే కుర్మయ్య మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం మెగా రైతు మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై రైతులకు అవగాహన కలుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొత్త రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ డి.రవికుమార్, వార్డు సభ్యులు మద్దని పద్మ, అగరయ్య, ఓర్సు నాగమ్మ, చిన్న సుల్తాన్, మొట్టే చిన్న నర్సింహా, నాయకుడు కె.సత్యనారాయణ గౌడ్‌తో పాటు ఇరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.