మానకొండూరులో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సూర్య - మానకొండూర్ : మానకొండూర్ మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ద్యావ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. 2006లో ఒక సామాన్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తన పట్టుదల, ప్రజా పోరాటాలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి అని అభివర్ణించారు.రేవంత్ రెడ్డి కేవలం ఒక వర్గానికి పరిమితమైన నాయకుడు కాదని.. యాదవులు, గౌడ, ముదిరాజ్ ఇలా అన్ని వర్గాల ప్రజలను, పీడిత సామాజిక వర్గాలను కలుపుకొనిపోయే నిజమైన ప్రజా నాయకుడని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీల రిజర్వేషన్ల వంటి కీలక విషయాల్లో ఆయన చూపిన పట్టుదల, దీక్ష అమోఘమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత ప్రగతి పథంలో దూసుకుపోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో ఏ ఎం సి చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్ర చారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, సర్పంచులు బుర్ర శ్రీధర్ గౌడ్, మీసా సత్యనారాయణ, కొత్త రామ్ రెడ్డి, రామడుగు హరీష్ ,నాయకులు నాగిశెట్టి రాజయ్య, మందల బక్కరెడ్డి, మాడ తిరుపతిరెడ్డి, బోళ్ల మురళి, గొల్లెన కొమురయ్య, కనకం అశోక్, ముక్కెర సతీష్, మాశం రామకృష్ణ, ఎడ్ల శ్రీధర్ ,గుజ్జ ప్రభాకర్, ననుమాల బాబురావు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.