33 కేవి విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించండి
మాగనూర్ సూర్య న్యూస్ :
మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీ నివాసితుల నిరీక్షణకు ఇంకా తెరపడలేదు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా, ఆ స్థలాల మీదుగా వెళ్తున్న 33 కేవి ప్రమాదకర విద్యుత్ లైన్ కారణంగా లబ్ధిదారులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. ఈ సమస్యపై స్పందిస్తూ, సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో ఎంపీవో కళ్యాణి కి కాలనీవాసులు సవినయంగా వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ, తలపైన ప్రమాదకరంగా వేలాడుతున్న 33 కేవి హైటెన్షన్ విద్యుత్ వైర్ల వల్ల ఇల్లు కట్టుకోవడం సాధ్యపడటం లేదని బాధితులు వాపోయారు. కాలనీ ఇండ్ల మధ్య నుంచే ఈ విద్యుత్ లైన్ వెళ్లడం వల్ల ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు రాత్రింబవళ్లు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎటువంటి పురోగతి లేకపోవడం పట్ల కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కాలనీలో ఉన్న 33 కేవి విద్యుత్ లైన్‌ను వేరొక ప్రాంతానికి తరలించాలని, నిరుపేదల ఇళ్ల నిర్మాణాలకు ఎదురవుతున్న అవరోధాలను తొలగించి, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి" అని కాలనీవాసులు వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉప సర్పంచ్ పెద్దింటి రాజు, పుంజనూరు ఆంజనేయులు, కావలి నరేందర్ ,ఎండి హనీఫ్, బ్యాగరి దత్తు ,పెద్దింటి పరశురాం ,చాకలి వెంకటేష్, జంగిటి వాబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆంజనేయులు, సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం