వికారాబాద్ మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
ఏఎంసీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్
నూతన రోడ్ల నిర్మాణానికి రూ.40.60 కోట్లు మంజూరు.. వికారాబాద్ మండలానికి రూ.7.95 కోట్లు విడుదల
వికారాబాద్, సెప్టెంబర్ 24 (సూర్య): అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వికారాబాద్ మండలాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ సూచించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయ సభా ప్రాంగణంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఎంపీడీవో వినయ్ కుమార్ అధ్యక్షతన, జడ్పీ సీఈవో సుధీర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరుపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షించారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో నూతన రోడ్ల నిర్మాణానికి రూ.40.60 కోట్లకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయని తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ మండలానికి రూ.7.95 కోట్లు విడుదల కావడం పట్ల సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధికి కృషి చేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రజాప్రతినిధులు–అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.