ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి గ్రామీణ రహదారులు, తాగునీరు, భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష జిల్లాల అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ బ్యూరో ప్రతినిధి: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం ప్రాంతీయ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు వరంగల్ ఐఓడీసీలో ఈ సమావేశం జరగనుంది.
ప్రధానంగా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 2026 అక్టోబర్ నుంచి 2027 జూన్ వరకు గ్రామస్థాయిలో చేపట్టాల్సిన నివారణ, ముందస్తు చర్యలు, రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై మంత్రి అధికారులతో సమీక్షించనున్నారు.
అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, వీఓ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పురోగతి, పూర్తయిన పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న హ్యామ్ (HAM) రహదారుల నిర్మాణ పనుల పురోగతి, తాగునీటి సరఫరా పరిస్థితి, పెండింగ్ పనులు, రానున్న కాలానికి అవసరమైన కార్యాచరణపై కూడా మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, ఈఎన్‌సీలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఇంజినీరింగ్ అధికారులు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు, డీఆర్డీఓలు, డీపీఓలు, ఈఈలు, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు హాజరుకానున్నారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన తాజా గణాంకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి నివేదికలు, పెండింగ్ పనుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరు కావాలని స్పెషల్ సీఎస్ దానకిశోర్ ఆదేశించారు.