విద్యుత్ ప్రమాదాల పై మంత్రి గొట్టిపాటి సీరియస్
విద్యుత్ ప్రమాదాల పై మంత్రి గొట్టిపాటి సీరియస్
-ప్రత్యేక చర్యలకు ఆదేశాలు
-విద్యుదాఘాతంతో నలుగురి మృతి..
- బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం
- తెగిపడిన విద్యుత్ వైర్లు ప్రాణాలు తీస్తున్నాయ్..
ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి
-బాపట్లలో తల్లి, కుమారుడి మృతి..
- నాతవరంలో ఇద్దరు మహిళల మృతి ఘటనలపై మంత్రి దిగ్భ్రాంతి
- స్తంభాలు కూలినా.. వైర్లు తెగిపడినా వెంటనే ఫిర్యాదు చేసేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి
-వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విద్యుత్ అంతరాయం..
-అదనపు సిబ్బంది, మెటీరియల్ సిద్ధం
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాలు, ఉత్తరాంధ్రలో వాయుగుండం ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుదాఘాతంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యుత్ ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
బాపట్ల, నాతవరం ఘటనలపై దిగ్భ్రాంతి
బాపట్ల మండలంలో తెగిపడిన ఎల్‌టీ విద్యుత్ లైన్ తాకి తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. అదేవిధంగా నర్సీపట్నం నాతవరం ప్రాంతంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయం అందిస్తామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన నాగరాజుకు అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ లైన్లు, స్తంభాలపై నిరంతర నిఘా
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ వైర్లు, స్తంభాల స్థితిగతులను అధికారులు నిరంతరం పరిశీలించాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, పాత స్తంభాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
వాయుగుండం ప్రభావంతో విద్యుత్ అంతరాయం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈపీడీసీఎల్ పరిధిలో అవసరమైన అదనపు సిబ్బందిని, విద్యుత్ పరికరాలు, ఇతర మెటీరియల్‌ను ఎస్‌పీడీసీఎల్ నుంచి తరలించినట్లు వివరించారు.
వైర్లు తెగిపడితే వెంటనే సమాచారం ఇవ్వాలి
ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలినా, వైర్లు తెగిపడినా ప్రజలు వెంటనే సంబంధిత సమీప విద్యుత్ కార్యాలయాలకు సమాచారం అందించేలా సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.