సూర్య,కౌటాల : మండలంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ సోమవారం మండలంలోని సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించి అనంతరం ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి కోతలు విధిస్తుండటంతో సాగు తీవ్రంగా దెబ్బతింటోందని వాపోయారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ ఐ సతీష్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారి అంజల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలను పరిశీలించి వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో దర్న విరమించారు