సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
పొదలకూరు, మేజర్ న్యూస్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి ఓటేసి , అరాచక వాదులను తరిమికొట్టాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. పొదలకూరు మండలంలో అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలు గుండెలపై చేతులు వేసుకుని ఆలోచించాలని కోరారు. పొదలకూరు మండలంలో సోమవారం సోమిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఏ ఎన్నికల్లోనూ పొదలకూరులో తనకు మెజార్టీ రాలేదని, ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సోమిరెడ్డి పేర్కొన్నారు. మరి గెలిచిన వారు ఈ ప్రాంతానికి ఏం చేశారో ప్రజలు ఆలోచించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.
తోడేరు ప్రజల కోరికలు నెరవేరుస్తా తనకు ఏ రోజూ ఓటు వేయని తోడేరు గ్రామ ప్రజలపైనా తనకు ఎలాంటి కోపం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు రైతులకు పట్టాల మంజూరు, హైస్కూలులో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు, గ్రావెల్ రోడ్డుకు నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
రూ.20 లక్షలతో రోడ్లకు శంకుస్థాపన.. రూ.43.60 లక్షలతో తాగునీటి ట్యాంకు ప్రారంభం పొదలకూరు మండలం తాటిపర్తిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ల పనులకు సోమిరెడ్డి శంకుస్థాపన చేశారు. తోడేరు పంచాయతీ పరిధిలోని రత్నగిరిలో రూ.43.60 లక్షలతో నిర్మించిన తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అలాగే సెయిల్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో, రాగప్రణీత స్పీచ్ థెరపీ సంస్థ సహకారంతో పొదలకూరులో రూ.10 లక్షల విలువైన వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం పొదలకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన హీరో మోటార్‌సైకిల్స్ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్. శివప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్‌బాబు, ఏఎంసీ చైర్మన్ వెంపులూరు అరుణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు, టీడీపీ నాయకులు పార్లపల్లి మోహన్, సురేష్‌రెడ్డి, బాల్రెడ్డి, హనుమారెడ్డి, పార్లపల్లి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.