వయోవృద్ధుల సంక్షేమం, సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలు
*జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28):వయోవృద్ధుల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026ను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వయోవృద్ధుల సంక్షేమం, సాధికారత వారోత్సవాల గోడపత్రాలను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. వయోవృద్ధుల ఆరోగ్యం, భద్రత, డిజిటల్ అవగాహన, సామాజిక అనుసంధానం, చట్టపరమైన హక్కులు, సంక్షేమంపై వారోత్సవాల్లో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 28న సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత, వయోవృద్ధులపై వేధింపుల నుంచి రక్షణ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.సెప్టెంబర్ 29న తరతరాల మధ్య అనుబంధం, పరస్పర అభ్యాసం, 30న చురుకైన వృద్ధాప్యం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహనతో పాటు వాకథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న రాష్ట్ర, జిల్లా స్థాయిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం–2007, నియమాలు–2011 ప్రకారం వయోవృద్ధులకు కల్పించిన హక్కులు, రక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యం, వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. వయోవృద్ధుల సంక్షేమం, రక్షణకు 14567 హెల్ప్‌లైన్, అత్యవసర పోలీస్ సహాయం కోసం 100కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.కుటుంబ సభ్యులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ వయోవృద్ధుల పట్ల గౌరవం, భద్రత, సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. వారి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో స్వర్ణలత, వయోవృద్ధుల సంక్షేమ అధికారి కాంతారావు, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.