గార మండలంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు...
గార, సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా గార మండలంలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ఆయా కేంద్రాలను సందర్శించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కళింగపట్నం పంచాయతీ పరిధిలోని శిలగాం, తాన్‌సాహెబ్‌పేట, చిన్నపల్లిపేటతో పాటు వొనరవిల్లి, బురవెల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, తల్లీబిడ్డల సంక్షేమ సేవలను ఆమె అభినందించారు.
అంగన్వాడీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో తల్లులకు ప్రభుత్వ సేవలు, పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని స్వాతి శంకర్ అన్నారు. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. టీచర్లు, ఆయాలు, కార్యకర్తల సేవలను గుర్తించి అభినందించడం అంగన్వాడీ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బందిని అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో గార మండల టీడీపీ అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణ, కళింగ వైశ్య రాష్ట్ర డైరెక్టర్ పొట్నూరు కృష్ణమూర్తి, ప్రసాద్ మాస్టర్, గార మండల మహిళా అధ్యక్షురాలు మల్లా ఆగ్నేయ, ఉపాధ్యక్షురాలు లోపింటి భవాని, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.