క్యూఆర్ కోడ్ స్కానింగ్ సమస్యలపై డీలర్లతో డీఎస్‌ఓ సమావేశం
65 దాటిన వృద్ధులు వికలాంగులకు రేషన్ బియ్యం అందేనా?
రావులపాలెం మేజర్ న్యూస్ :డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సివిల్ సప్లైస్ అధికారి విజయ భాస్కర్ (డీఎస్‌ఓ) మరియు ఎంఎస్‌ఓ వెంకటేశ్వరరావు మంగళవారం రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో కొత్తపేట డివిజన్‌కు చెందిన రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ విధానం, దాని అమలు విధానాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో పలువురు రేషన్ డీలర్లు మాట్లాడుతూ, రేషన్ బియ్యం బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానింగ్‌లో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. క్యూఆర్ కోడ్ సకాలంలో స్కాన్ కాకపోవడంతో ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు నిర్ణీత సమయంలో బియ్యం పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
దీనిపై స్పందించిన డీఎస్‌ఓ, క్యూఆర్ కోడ్ స్కానింగ్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డీలర్లకు క్యూఆర్ కోడ్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే KNSM వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయాలని సూచించారు.
అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మీ మార్ట్’ కార్యక్రమంపై ఆసక్తి ఉన్న రేషన్ డీలర్లు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి రేషన్ కార్డుదారుడి మొబైల్ నంబర్‌ను సంబంధిత రేషన్ కార్డుతో అనుసంధానం చేయించేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించారు.
సమావేశంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సాంకేతిక సమస్యల పరిష్కారం, వినియోగదారులకు మెరుగైన సేవలందించడంపై అధికారులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, కిషోర్, మట్టా బాబ్జి తదితరులు పాల్గొన్నారు.