వడ్ల లారీని అడ్డగించి రూ.1.20 లక్షలు డిమాండ్.. నలుగురు అరెస్టు
సూర్య కామారెడ్డి ప్రతినిధి: వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని అడ్డగించి, తాము విలేకరులమని చెప్పి డ్రైవర్‌ను బెదిరిస్తూ రూ.1.20 లక్షలు డిమాండ్ చేసిన కేసులో నలుగురిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 26న రాత్రి మల్లయ్యపల్లి గ్రామ శివారులోని పోచారం కెనాల్ సమీపంలో TS05UD4689 నంబర్ లారీని వ్యాగనర్ కారుతో అడ్డగించిన నిందితులు, లారీలోని వడ్లకు సంబంధించిన పత్రాలు చూపించాలని డ్రైవర్‌ను కోరారు. పత్రాలు చూపించకపోతే నలుగురికి ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి, డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని, పోలీసులకు పట్టించి కేసులు పెడతామని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా మహమ్మద్ అబ్దుల్ మోసిన్ (27), ఎడ్ల మహేష్ కుమార్, బుద్దే ఆనంద్, గాండ్ల సుధీర్ కుమార్లను గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి వ్యాగనర్ కారు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన ఎల్లారెడ్డి పోలీసులను ఎస్పీ అభినందించారు. వృత్తి, హోదాను అడ్డుపెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించినా నేరాలకు పాల్పడే వారు చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని తెలిపారు. కేసుకు సంబంధించిన మిగిలిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.