వాలీబాల్ విజేత సిర్పూర్ యూత్ జట్టుకు కిట్ అందజేత
సూర్య జైనూర్: సిర్పూర్(యు) మండల కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్లో విజయం సాధించి సత్తా చాటిన సిర్పూర్ యూత్ (చెరువు) జట్టుకు వాలీబాల్ కిట్‌ను అందజేశారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ సహకారంతో మేరా యువ భారత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాజీద్, సిర్పూర్(యు) మండల అధ్యక్షుడు కనక ఆనంద్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. క్రీడల్లో యువత ప్రతిభను వెలికితీయడంతోపాటు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కిట్‌ను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదల పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆత్రం ఓం ప్రకాశ్, ఉపసర్పంచ్ పెందోర్ రామారావు, సామాజిక కార్యకర్త షేక్ ఆరిఫ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.