బతుకమ్మ సంబరాల్లో బాల్య వివాహాలపై అవగాహన
బతుకమ్మ సంబరాల్లో బాల్య వివాహాలపై అవగాహన
-ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళల చైతన్య కార్యక్రమం
-అశ్రిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రమేష్
సిద్దిపేట రూరల్ : బతుకమ్మ సంబరాలను సామాజిక చైతన్యానికి వేదికగా మలిచి, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించినట్లు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రమేష్ తెలిపారు.శుక్రవారం రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూనే బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై మహిళలు ప్రత్యేక పాట పాడారు. బాల్య వివాహాలను అరికట్టాలని, బాలల హక్కులను పరిరక్షించాలని కోరుతూ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, ప్రతి బాలబాలికకు విద్యతో పాటు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలని అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు, మహిళలు, యువతతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.బతుకమ్మ వంటి సాంస్కృతిక వేడుకల ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చని, బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
(సూర్య రూరల్, రమేష్)