తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి :ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. మీ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది. పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో అనుమతులు, భూమి, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పిస్తాం. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన, అనుకూలమైన గమ్యస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి" అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్‌కు తాను గార్డియన్‌గా వ్యవహరిస్తానని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
హైటెక్స్‌లో నిర్వహించిన సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ బిజినెస్ మీట్–2026లో ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టికర్తలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా అందించడంతోపాటు, పారిశ్రామిక పార్కుల ద్వారా భూమి, అవసరమైన విద్యుత్, నీటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూలమైన వ్యాపార వాతావరణం హైదరాబాద్‌ను పెట్టుబడులకు అత్యంత అనువైన గమ్యస్థానంగా నిలుపుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనేక అనుకూలతలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు. దేశంలో భౌగోళికంగా అనువైన ప్రాంతంలో ఉండటం, పారిశ్రామిక అవసరాలకు తగిన భూమి అందుబాటులో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థల ద్వారా అభివృద్ధి చెందిన నైపుణ్యవంతమైన మానవ వనరులు రాష్ట్రానికి ప్రధాన బలాలని అన్నారు. హైదరాబాద్ వాతావరణం, బహుభాషా సంస్కృతి, వివిధ ప్రాంతాల ప్రజలను ఆదరించే సంప్రదాయం కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయని చెప్పారు.
ప్రాచీన కాలం నుంచి హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులను, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులను తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వివరించారు.
మూడు ప్రాంతాలుగా అభివృద్ధి ప్రణాళిక
హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి కోర్ అర్బన్ రీజియన్ (కోర్), పెరి అర్బన్ రీజియన్ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ (రేర్) విధానాల ద్వారా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కోర్ అర్బన్ ప్రాంతంలో ఐటీ, మౌలిక సదుపాయాలు, సేవారంగానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. పెరి అర్బన్ ప్రాంతంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు, భవిష్యత్తులో నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అనుసంధానిస్తూ రేడియల్ రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే 21 రేడియల్ రోడ్లకు సంబంధించి మంజూరు, రూపకల్పన ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ రహదారుల అనుసంధానంతో ఫార్మా, బయోటెక్నాలజీ, విద్య, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. రూరల్ అగ్రికల్చర్ రీజియన్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వనరులకు విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు కావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
సంపద సృష్టిలో పారిశ్రామికవేత్తలదే కీలక పాత్ర
మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో సంపద సృష్టికి వ్యవసాయంతోపాటు పరిశ్రమలు, సేవారంగం కీలకంగా మారాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా సుమారు 16 శాతం ఉండగా, పరిశ్రమలు, సేవారంగం కలిపి ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతున్నాయని వివరించారు. సేవారంగం వాటా సుమారు 65 శాతంగా ఉందని, పారిశ్రామిక రంగం కూడా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
ఫార్మా, కోర్ ఇండస్ట్రీలు, ఆక్వా, ఎగుమతులు, దిగుమతులు, ఐటీ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు వంటి విభిన్న రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మరింతగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించేవారికి ప్రతి రాష్ట్రం, ప్రతి సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు ఎదగడంతోపాటు రాష్ట్రానికి ఉపాధి, పెట్టుబడులు, ఆదాయం పెరగడానికి దోహదపడాలని ఆకాంక్షించారు.
పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సహా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, భూమి, విద్యుత్, నీరు వంటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయాలు, వ్యాపారం, సినీ పరిశ్రమ, వ్యవసాయం, ఐటీ, ఏరోస్పేస్, రక్షణ రంగం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పారు.
అందరినీ కలుపుకొని అభివృద్ధి సాధించాలి
సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పారిశ్రామికవేత్తలు తమ అనుభవం, పరిజ్ఞానాన్ని ఇతర వర్గాలతో పంచుకోవాలని, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. సమాఖ్య వంటి సంస్థల ద్వారా ఈ తరహా కార్యక్రమాలకు వేదికలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒక వర్గం మాత్రమే అభివృద్ధి చెందడం సంపూర్ణ ప్రగతి కాదని, తమతోపాటు మరో పదిమందిని ముందుకు తీసుకెళ్లినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వం కూడా వారితో కలిసి పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికిన భట్టి విక్రమార్క, వ్యాపారాలు విస్తరించుకుంటూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు సహకరించాలని కోరారు.
.