ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం
అంగరంగ వైభవంగా శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామి తిరునక్షత్ర మహోత్సవం
ఫోటో రైట్ అప్. అహోబిల దృశ్యాలు
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్ : ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం శ్రీ అహోబిల మఠ ప్రథమ పీఠాధిపతులైన శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాన్ని వేణుగోపాలాచార్యులు తమ అర్చక బృందంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా మంగళాశాసనం నిర్వహించి అనంతరం స్వామివారికి తిరుమంజనం నిర్వహించారు. వేదమంత్రాలు, దివ్యప్రబంధ పారాయణాల నడుమ జరిగిన ఈ కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తాయి.
శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామివారి దివ్య వైభవాన్ని స్మరించుకుంటూ వారి ఆధ్యాత్మిక సేవలను భక్తులు కొనియాడారు. ఈ పవిత్ర మహోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యానుగ్రహం సర్వలోక క్షేమానికి, భక్తుల సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.ఈ తిరునక్షత్ర మహోత్సవం అహోబిల క్షేత్రంలో ఆలయ మాడ వీధులకుండా గ్రామోత్సవం నిర్వహించారు.
శ్రీ ప్రహ్లాదవరద స్వామివారికి 78 గ్రాముల బంగారు లక్ష్మీహారం సమర్పణ....
అహోబిలంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అహోబిల మఠ ప్రథమ పీఠాధిపతులైన శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రహ్లాదవరద స్వామివారికి 78 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు జిల్లాకు చెందిన కపూర్ లక్ష్మీనరసింహ స్వామి ఈ బంగారు లక్ష్మీహారాన్ని సమర్పించగా దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలాచార్యులు, మనియార్ సౌమ్యనారాయణకి అందజేశారు.