108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండల ప్రజలు 108 అత్యవసర అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా 108 మేనేజర్ మండ శ్రీనివాస్ కోరారు. గురువారం భీమదేవరపల్లిలోని 108 అంబులెన్స్ను తనిఖీ చేసి, వైద్య పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. వర్షాకాలంలో విష పురుగుల కాట్లు, విద్యుత్ షాక్లు, రోడ్డు ప్రమాదాలు, గర్భిణుల అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 108కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 756 మంది ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందిని ఆయన అభినందించారు. నవజాత శిశువుల కోసం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రత్యేక నియోనేటల్ అంబులెన్స్ అందుబాటులో ఉందని తెలిపారు. వెంటిలేటర్, ఇంక్యుబేటర్ తదితర ఆధునిక వైద్య పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ ద్వారా అవసరమైన శిశువులను వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రులకు ఉచితంగా తరలిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డా. మునీబ్, 108 సిబ్బంది విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా