సురక్షితంగా ఇంటికి చేరండి .. సీఐ వెంకటేశ్వర్లు
అతివేగం ప్రమాదకరమని పండుగ సంబరాలలో వేగంగా ప్రయాణం చేయకుండా జాగ్రత్తగా వాహనాలు నడిపి సురక్షితంగా ఇంటికి చేరాలని ఆమనగల్ సీఐ సంద వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలలో పట్టణాలకు తరలివెల్లి పండుగకు సొంత ఊర్లకు బైకులు, కార్లల్లో వచ్చేవారు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని. ప్రయాణ సమయంలో ఇంటి వద్ద తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆయన సూచించారు. అతివేగంతో కాకుండా బైక్ పై వచ్చేవారు హెల్మెంట్లు, కార్లలో వచ్చేవారు సీటు బెల్టులను పెట్టుకోవడం మర్చిపోవద్దని ఆయన చెప్పారు. పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది కానీ పోయిన ప్రాణం తిరిగి రాదన్న నగ్న సత్యాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. పండుగలకు వచ్చేవారు తమ ఇండ్లకు తాళం వేసే విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, అదే సమయంలో విలువైన వస్తువులను తమ వెంట జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహిళలు బతుకమ్మ పండుగ సందర్భంగా నీటి కుంటలు, చెరువుల వద్దకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పట్టణ, మండల ప్రజలకు ముందుగా సిఐ వెంకటేశ్వర్లు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఎ. చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.