సిరిసిల్లకు నేడు సీఎం రేవంత్.. భారీ సభకు ఏర్పాట్లు
సిరిసిల్ల: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సుమారు రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి రగుడు జంక్షన్ వరకు భారీ ర్యాలీలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం రగుడు బైపాస్ సమీపంలోని సభా ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు సుమారు లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు, కాంగ్రెస్ నేతలు తెలిపారు.
పర్యటనలో భాగంగా నేతన్నల సంక్షేమం, విద్య, మహిళా సాధికారత, మౌలిక వసతులు తదితర రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. వేములవాడలో యంగ్ ఇండియా సమీకృత వసతి పాఠశాల, రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు, కొత్త ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, సభా ప్రాంగణ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.