జడ్పీ చైర్మన్ రేసులో నేనూ ఉంటా….!
అవకాశం వస్తే జిల్లాలో ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
నన్ను అనవసరంగా టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు
మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్:
వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే జిల్లాలో ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.తాండూరు పట్టణంలోని తన నివాసంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. కొన్నేళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్నానని, ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరిస్తానని తెలిపారు. తాండూరులో కొందరు పనిలేక తనను అనవసరంగా లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం లేదని, అలాంటి వారికి మద్దతు కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.తనను ‘షాడో ఎమ్మెల్యే’గా అభివర్ణించడం బాధాకరమని అన్నారు. తన కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీ ద్వారా సామాజిక బాధ్యతలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు రక్షణ సహాయ నిధికి రూ.17 లక్షలు అందించినట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో తాండూరు ప్రాంతానికి చెందిన సుమారు 200 మంది పనిచేస్తున్నారని, వారికి నెలకు దాదాపు రూ.60 లక్షల మేర వేతనాలు చెల్లిస్తున్నట్లు వివరించారు. కరోనా సమయంలో పలు గ్రామాలకు ఉచితంగా శానిటేషన్ సామగ్రిని పంపిణీ చేసినట్లు చెప్పారు.తనకు చెందిన ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ అసైన్డ్ భూమిలో ఉందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, అది నిరూపిస్తే ఫ్యాక్టరీని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీనివాస్‌రెడ్డి సవాల్ చేశారు.
అభివృద్ధే మా కుటుంబ లక్ష్యం
తన సోదరుడు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలో సుమారు రూ.2 వేల కోట్లతో 2,239 అభివృద్ధి పనులు చేపట్టినట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తమ అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాండూరు ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా కలిసి ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.తనపై అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఓపికకు హద్దు ఉంటుందని, తనను మరింత రెచ్చగొడితే తగిన విధంగా స్పందిస్తానని హెచ్చరించారు. తమ కుటుంబం ప్రజాసేవకు అంకితమైందని, వాస్తవాలు తెలుసుకోకుండా మిడిమిడి సమాచారంతో తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.రిపోర్టర్ పంజుగుల రామచందర్.