ప్రారంభోత్సవానికి సిద్ధమైన కరీంనగర్ నూతన పాలనా భవనం
వెలుగుల జిలుగుల్లో.. కొత్త కలెక్టరేట్
సీఎం రాకకు సర్వాంగ సుందరంగా ముస్తాబు..
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
చీకట్లను చీల్చుకుంటూ విరజిమ్ముతున్న విద్యుత్ కాంతులు.. బంతిపూల వర్ణశోభతో మెరిసిపోతున్న ప్రాంగణం.. చూపుతిప్పుకోనివ్వని అలంకరణ.. ఇవన్నీ కలగలిసి కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి మరికొద్ది గంటలే మిగిలి ఉండటంతో కలెక్టరేట్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాత్రివేళ వెలుగుల కాంతుల్లో కొత్త భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూలదండలు, బంతిపూలతో భవనాన్ని అందంగా అలంకరించగా.. విద్యుత్ దీపాల వెలుగుల్లో కలెక్టరేట్ నూతన శోభను సంతరించుకుంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు రాత్రి వరకు ఏర్పాట్లలో నిమగ్నమై తుది పనులను పూర్తి చేశారు.
అడుగడుగునా కలెక్టర్ పర్యవేక్షణ
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రతి అంశాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. తరచూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, ప్రాంగణం, అలంకరణ, భద్రత, పార్కింగ్, ప్రోటోకాల్ తదితర అంశాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.రాత్రి వరకు కొత్త కలెక్టరేట్ లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారునూతన కలెక్టరేట్ భవనం ప్రారంభానికి సిద్ధం కావడంతో జిల్లా ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఆధునిక వసతులతో అందుబాటులోకి రానున్న కొత్త కలెక్టరేట్ జిల్లా పరిపాలనకు కొత్త రూపాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ భవనం కరీంనగర్ జిల్లా పాలనా చరిత్రలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.