గొలుసు దొంగలపై పోలీసుల ప్రత్యేక నిఘా
అనంతపురం బ్యూరో
గొలుసు దొంగలపై పోలీసుల ప్రత్యేక నిఘా
మహిళలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ పి. జగదీష్
అనంతపురం: జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న గొలుసు దొంగతనాల (చైన్ స్నాచింగ్) ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు, నిఘాను ముమ్మరం చేశారు.
ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని దుండగులు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలు, చీకటి రహదారుల్లో ఒంటరిగా ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బంగారు ఆభరణాలు బయటకు కనిపించకుండా చున్నీ లేదా కొంగుతో కప్పుకోవడం మంచిదని సూచించారు.
తెలియని వ్యక్తులు చిరునామా అడుగుతూ ద్విచక్ర వాహనాలపై సమీపానికి వచ్చినప్పుడు తగినంత దూరం పాటించాలని పోలీసులు సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వెళ్లే మహిళలు వీలైనంత వరకు గుంపులుగా వెళ్లాలని కోరారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసే సమయంలో, కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు కూడా పరిసరాలను గమనిస్తూ ఉండాలని సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 112 ఉచిత హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
ఎస్పీ ఆదేశాలతో జిల్లా సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున పెట్రోలింగ్‌ను మరింత పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపైనా ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రజల భద్రతే పోలీసుల మొదటి ప్రాధాన్యమని ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.