సాయిపూర్ 9వ వార్డులో రేపు ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
తాండూరు, మేజర్ న్యూస్: తాండూరు పట్టణంలోని సాయిపూర్ 9వ వార్డులో ఆదివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ సంబరాలను ధూమ్ధామ్గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక తాతగుడి ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మున్సిపల్ కౌన్సిల్లో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్న దీప నర్సింలు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకలకు తాండూరు తాజా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సతీమణి ఆర్తి రెడ్డితో పాటు ఆయన తల్లిదండ్రులు ప్రమోదినీ దేవి, విఠల్ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సింలు తెలిపారు. అలాగే తోటి కౌన్సిలర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయనున్నట్లు దీప నర్సింలు పేర్కొన్నారు. మహిళల సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. వార్డు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలను విజయవంతం చేయాలని దీప నర్సింలు కోరారు.