రెండు బైకులు ఢీకొని - ఇద్దరు వ్యక్తులు మృతి
షాబాద్ మండలం సంకేపల్లిగూడ గేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అస్సాంకు చెందిన బినయ్ సింగ్ బుధవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మల్లారెడ్డిగూడ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై షాబాద్ మండలం సంకేపల్లిగూడ గేట్ వైపు రాంగ్ రూట్ లో వస్తున్నాడు. అదే సమయంలో షాబాద్ నుంచి తన స్వగ్రామమైన చన్వెల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పల్లె రాజమల్లయ్య వాహనాన్ని బినయ్ సింగ్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బినయ్ సింగ్‌కు తలకు తీవ్ర గాయమై ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పల్లె రాజమల్లయ్యను కుటుంబ సభ్యులు, స్థానికులు 108 అంబులెన్స్‌లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- జానంపేట శివరాజ్ : మేజర్ న్యూస్, షాబాద్.