రైతులు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటలను ఎంపిక చేయాలి - జిల్లా కలెక్టర్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి:రైతు నేస్తం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు కూరగాయల సాగును ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు
కామారెడ్డి జిల్లాలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటూ, సమగ్ర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.
చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో నిర్వహించిన రైతుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత వానాకాలంలో వర్షపాతం లోటు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేపట్టాలని సూచించారు. జిల్లాలోని 72 రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో సుమారు 5,000 మంది రైతులు, 200 మంది ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని పంటల సాగు, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించినట్లు తెలిపారు.