ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక అల్పాహారం!
విద్యార్థుల ఆరోగ్యం.. భవిష్యత్తే లక్ష్యంగా తెలంగాణ అల్పాహార పథకం
గర్రెపల్లి పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు
సూర్య పెద్దపల్లి ప్రతినిధి:::
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్యం, భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో హరే రామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్లడంతో విద్యార్థులకు అల్పాహారం అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వారానికి ఆరు రోజులపాటు వివిధ రకాల అల్పాహారంతోపాటు పాలు అందిస్తున్నట్లు తెలిపారు.పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.70 కోట్లు ఖర్చు చేసినట్లు విజయరమణారావు తెలిపారు. రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు ఏడాదిలో పూర్తి చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో విద్య, వసతి కల్పిస్తామన్నారు. ఓదెలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గర్రెపల్లి పాఠశాల విద్యార్థులు, గ్రామస్తుల కోరిక మేరకు ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.