వీఎల్‌ఎస్‌ఐ సాంకేతికతతో తదుపరి తరం బయోసెన్సర్ డిజైన్‌పై వర్క్‌షాప్
నంద్యాల అర్బన్:
శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజ్ (అటానమస్), నంద్యాలలోని ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో, ఐ ఈ టి ఈ సహకారంతో “నెక్స్ట్ జనరేషన్ బయో సెన్సార్ డిజైన్ యూజింగ్ విఎల్ఎస్ఐ అండ్ ఎమర్జింగ్ అప్లికేషన్స్" అనే అంశంపై వారం రోజుల వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 22 నుంచి 26, 2026 వరకు కళాశాలలోని సెమినార్ హాల్‌లో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి. సుబ్రహ్మణ్యం గారు ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆధునిక వైద్యరంగంలో వేగవంతమైన, ఖచ్చితమైన ఆరోగ్య నిర్ధారణకు బయోసెన్సర్లు ఎంతో కీలకమైనవి. విఎల్ఎస్ఐ సాంకేతికతను బయోసెన్సర్‌లతో అనుసంధానం చేయడం ద్వారా చిన్న పరిమాణంలో, తక్కువ విద్యుత్ వినియోగంతో, వేగవంతమైన సెన్సింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఇటువంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను నేర్చుకుని, పరిశోధన మరియు ఆవిష్కరణల వైపు ముందుకు సాగాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ వై. మల్లికార్జున రావు గారు మాట్లాడుతూ, “బయోసెన్సర్ టెక్నాలజీ అనేది ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, వైద్యరంగాల సమన్వయంతో అభివృద్ధి చెందుతున్న అంతరశాస్త్ర సాంకేతికత. విఎల్ఎస్ఐ డిజైన్, ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్ మరియు ఎమర్జింగ్ అప్లికేషన్స్‌పై విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కల్పించడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పరిశ్రమ మరియు పరిశోధన అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి” అని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌కు కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు హెడ్ అఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ కె శ్రీనివాస రావు గారు వనరుల వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. వర్క్‌షాప్‌లో విఎల్ఎస్ఐ డిజైన్ సెన్సార్ట్స్ మరియు ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ వంటి అంశాలపై విద్యార్థులకు నిపుణులచే అవగాహన కల్పించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఈసీఈ విభాగం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ కె వినోద్ కుమార్ సమన్వయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.