వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి
అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత వారం రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెకు మద్దతుగా ప్రొద్దుటూరులో వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, న్యాయపరమైన డిమాండ్లను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు తాలూకా వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు ఆర్. మునయ్య, ఉపాధ్యక్షుడు మునయ్య, కార్యదర్శి రాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాల మహానాడు చెన్నయ్య వర్గం జిల్లా అధ్యక్షుడు జేష్టాది భాస్కర్, జిల్లా కార్యదర్శి కొత్తమాస్ రాబర్ట్, జిల్లా యువజన సంఘం నాయకుడు తీట్ల చిట్టిబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోరగుడి కుమార్, తాలూకా అధ్యక్షుడు జేష్టాది మధు తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి నాయకులు, వీఆర్ఏలు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజును కలిసి వీఆర్ఏల సమస్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ వీఆర్ఏల సంఘం, మాల మహానాడు సంయుక్త ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారి న్యాయపరమైన డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. వీఆర్ఏలు ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ, తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సమ్మె చేపట్టాల్సి వచ్చిందని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని వారు కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు, సభ్యులు, మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.