ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం
తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవమైనది, భక్త జనాకర్షకమైనది రథోత్సవం. ఎనిమిదవ రోజు ఉదయం, ఉదయ సూర్యుని కిరణకాంతులలో మేరుపర్వతం వంటి రథంలో ఇరువైపులా శ్రీదేవీ, భూదేవులు సేవిస్తుండగా, మధ్యలో మలయప్పస్వామి వేంచేసి ఉండగా, భక్తజనులందరూ గోవింద నామస్మరణ చేస్తూ రథపు పగ్గాలను లాగుతుండగా తిరుమల నాలుగు మాడవీధులలో నెమ్మదిగా రథోత్సవం జరుగుతుంది.
ఈ ఉత్సవంలో భక్తులు రథపు పగ్గాలను పట్టుకొని రథాన్ని లాగుతూ స్వయంగా పాల్గొనడం ఈ రథోత్సవం ప్రత్యేకత. ఇతర వాహన ఊరేగింపులలో భక్తులు ప్రేక్షకులు మాత్రమే. స్వయంగా పాల్గొనే అవకాశం లేదు. రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొనడం వల్లనే ఉత్సవం అత్యంత వైభవంగా, కోలాహలంగా ఉంటుంది.
“రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే” — రథంలో వేంచేసియున్న విష్ణుదేవుని దర్శనం జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది అనే విశ్వాసంతో భక్తులందరూ రథోత్సవంలో స్వయంగా పాల్గొంటారు.
శ్రీనివాసుడు దేవేరులతో రథంపై మాడవీధులలో ఊరేగుచుండగా భాగవతోత్తములు భక్తిగీతాలను పాడుచూ ఉప్పొంగి ఆడుచున్నారు. రథం ముందు భోగస్త్రీలు జతలుగా కన్నులపండువుగా చేతులు త్రిప్పుచూ నృత్యాలు చేస్తున్నారు. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల సోదరుడు అయిన అచ్యుతదేవరాయలు (క్రీ.శ. 1529–1542) తిరుమలలో వేంకటేశ్వరస్వామి పరిచర్యకుగాను రంజకం కుప్పసాని కుమార్తె ముద్దుకుప్పాయి అను నాట్యకళావిశారదను నియమించినాడని శాసనం 4-11, తేదీ: 6-6-1531 తెలియజేస్తున్నది. ఆనాడు దేవదాసీలను ‘ఎంబెరుమానడియార్’ అని గౌరవించేవారు.
దేవదాసీలు ఊరేగింపుకు ముందు నృత్యం చేయుటను వెంగమాంబ వర్ణించింది. నేడు ఊరేగింపుకు ముందు స్త్రీలు, యువతులు ప్రవేశించి భజనలు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ భక్తిని, ఆనందాన్ని కలిగిస్తున్నారు. వేంకటేశ్వరుని వైభవాన్ని వందిమాగధులు, సూతులు ఎలుగెత్తి పొగడుతున్నారు. భక్తులు కొందరు తలపై కలశాలను పెట్టుకొని పేరణి నృత్యాలు చేస్తున్నారు. కొందరు భక్తులు పారవశ్యంతో “గోవిందా! గోవిందా!” అని గొంతెత్తి పలుకుతున్నారు. కొందరు పేరంటాండ్రు మాడవీధులలో ఉన్న మేడలపై నుండి రథంపై సేసలు (బియ్యం) ప్రీతితో చల్లుతున్నారు. నేడు భక్తులు రథంపై ఉప్పు, మిరియాలు చల్లుతున్నారు.
తిరుమల దేవాలయ గోడలపై రథోత్సవానికి సంబంధించిన శాసనాలు చాలా ఉన్నాయి. తాళ్లపాక పెదతిరుమలాచార్యులు తన పేర ఏర్పాటు చేసిన ఆణి బ్రహ్మోత్సవంలోను మూడు రథాల్లో — బ్రహ్మదేవుడు, విష్వక్సేనుడు, వేంకటేశ్వరుడు — పాల్గొంటుండేవారని అతడు వేయించిన ధర్మశాసనం 4-129, తేదీ: 17-3-1539 వలన తెలుస్తున్నది. ఎట్టూరు తిరుమల కుమార తాతాచార్యులు ఏర్పాటు చేసిన అల్పిశి బ్రహ్మోత్సవంలో మూడురథాల అలంకరణ కోసం ఒక రేఖై పొన్ను, రెండు పణాలు కట్టడి చేసినట్లు అతడు వేయించిన ధర్మశాసనం 6-5, తేదీ: 25-9-1583 వలన తెలియుచున్నది.
రథోత్సవం విశిష్టమైన తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నది. కఠోపనిషత్తు ఆత్మకు, శరీరానికి ఉండే సంబంధాన్ని రథయాత్రతో పోల్చి చక్కగా వివరించింది.
ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ
ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్”
శరీరం రథం. బుద్ధి సారథి, మనస్సు కళ్లెము. ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు అవి పరుగులు తీసే మార్గాలు. ఆత్మ (అంతర్యామిగా ఉన్న భగవదంశ) రథికుడు. గుర్రాలవంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపుచేసి, రథంవంటి శరీరాన్ని మీ బుద్ధి అనే సారథి ద్వారా చక్కని మార్గంలో నడిపించి, రథికుడైన ఆత్మను — నన్ను — గుర్తించి, సేవించి, తరించండని హితబోధ చేస్తున్నాడు వేంకటేశ్వరస్వామి.