రాజమహేంద్రవరంలో ఘనంగా పోషన్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్.. ప్రారంభించిన ఎంపీ పురందేశ్వరి!
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: జాతీయ పోషణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలో పోషన్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ డి. పురందేశ్వరి అత్యంత ఘనంగా ప్రారంభించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రాంగణంలో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పోషకాహార ప్రాముఖ్యతను, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలకు వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థులను, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ పురందేశ్వరి ప్రదర్శనలోని వివిధ స్టాల్స్‌ను పరిశీలించి, పోషణ్ అభియాన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ జి. సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్రతో పాటు పలువురు అధికార ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారం ఎంతగానో దోహదపడుతుందని, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.