పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. నిందితులపై కఠిన చర్యలు
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 26): పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడం తీవ్రంగా పరిగణిస్తామని, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పరిగి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పరిగి పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నర్సింలు గొడవను అదుపు చేసేందుకు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో గొడవలో పాల్గొన్న తరుణ్ అనే వ్యక్తి కత్తితో కానిస్టేబుల్ నర్సింలుపై దాడి చేయడంతో కడుపులో తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన జరిగిన వెంటనే పరిగి ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ అధికారులు స్పందించి గాయపడిన కానిస్టేబుల్‌ను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కాంటినెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ నర్సింలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
*ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ఎస్పీ
ఘటన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హైదరాబాద్‌కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ నర్సింలును పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశంఈ ఘటనపై పరిగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.
*పోలీసులపై దాడి చేస్తే కఠిన చర్యలు
“పోలీసు సిబ్బంది ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడం, బెదిరించడం లేదా విధులకు ఆటంకం కలిగించడం ఎంతమాత్రం సహించేది లేదు. పోలీసులపై దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై రౌడీ షీట్ ప్రారంభించడం జరుగుతుంది. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు చేపడతాం” అని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గొడవలకు పాల్పడటం, ఆయుధాలతో తిరగడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.