మహారాష్ట్రలోని 265 తాలూకాల్లో కరవు ప్రకటన.. రైతులకు ఊరటనిస్తూ 12 పాయింట్ల సహాయక ప్యాకేజీ విడుదల
సూర్య జాతీయ డెస్క్: ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంట నష్టంతో అల్లాడుతున్న అన్నదాతలను ఆదుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 358 తాలూకాలకు గాను ఏకంగా 265 తాలూకాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు (జీఆర్) జారీ చేసింది. వ్యవసాయ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా వర్షపాత లోటు తీవ్రంగా ఉన్న ఈ ప్రాంతాల్లో 'ట్రిగ్గర్-1' కింద కరవు పరిస్థితులను గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు, గ్రామీణ ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించే లక్ష్యంతో సమగ్రమైన 12 పాయింట్ల ప్రత్యేక సహాయక ప్యాకేజీని అమలులోకి తెచ్చింది.
ప్రకటించిన 12 పాయింట్ల ఉపశమన చర్యల్లో భాగంగా రైతులకు భూమి శిస్తులో పూర్తి మినహాయింపు, పంట రుణాల రీస్ట్రక్చరింగ్ మరియు వ్యవసాయ రుణాల రికవరీపై తాత్కాలిక స్టే విధించారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ బిల్లుల రాయితీని విస్తరిస్తూ, విద్యుత్ కనెక్షన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ కట్ చేయకూడదని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో చదివే రైతుల పిల్లల పరీక్ష ఫీజుల మినహాయింపుతో పాటు ఉపాధి హామీ పథకం నిబంధనలను సడలించి పెద్ద ఎత్తున పనులను ప్రారంభించనున్నారు. తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, వ్యవసాయ కూలీలకు ఆహార ధాన్యాల పంపిణీ, పశువులకు సరిపడా దాణా, మేత డిపోల ఏర్పాటు మరియు భారీ ఎత్తున నీటి సంరక్షణ చర్యలను ఈ ప్యాకేజీలో పొందుపరిచారు.
కరవు ప్రభావిత 265 తాలూకాల్లో పంట నష్టాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు తక్షణమే క్షేత్రస్థాయి పంచనామా ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పంటల స్థితిగతులను తెలిపే ఛాయాచిత్రాలు, జీపీఎస్ కోఆర్డినేట్లతో కూడిన సాంకేతిక సమాచారాన్ని సేకరించి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూస్తామని, గత పథకాల్లో లబ్ధి పొందని వారికి కూడా పంట రుణమాఫీ వర్తింపజేసేలా తదుపరి మార్గదర్శకాలు విడుదల చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.