నేడు మెట్రోలో ప్రయాణించనున్న మంత్రులు, అధికారులు
హైదరాబాద్, సూర్య ప్రతినిధి : భాగ్యనగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్' సేవలను ప్రోత్సహిస్తూ, స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు నేడు మెట్రో రైలులో ప్రయాణించనున్నారు.
బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కామన్ పాస్‌ను ఉపయోగించి మెట్రోలో ప్రయాణించేందుకు నిర్ణయించారు. అనంతరం మెట్రో స్టేషన్ వద్ద నుంచి ఆర్టీసీ బస్సుెక్కి ప్రయాణించి ప్రయాణికులతో నేరుగా మాట్లాడనున్నారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ఒకే పాస్‌తో ప్రయాణించేలా ఈ వినూత్న విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా రోజువారీ పాస్ ధర రూ. 400 (మెట్రో రూ. 300 + ఆర్టీసీ రూ. 100), నెలవారీ పాస్ ధర రూ. 8,500 గా నిర్ణయించారు. సామాన్య ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలనే లక్ష్యంతోనే ఈ ప్రయాణ కార్యక్రమాన్ని తలపెట్టారు.