నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఎదుట కార్మికుల నిరసన
నారాయణపేట, సూర్యన్యూస్:
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల వేతనాల పెంపు పట్ల ప్రభుత్వ ఉదాసీనత వైఖరి, వివక్ష తగదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల జీతాలు పెంచాలని, కార్మికుల పట్ల వేధింపులు, పనిభారం తగ్గించాలని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నెల మొదటి రోజునే కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించాలని, కాలం చెల్లిన ఏజెన్సీలను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై శనివారం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట కాంట్రాక్టు కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటరీ భద్రత రోగి సంరక్షణ సూపర్వైజర్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐహెచ్ఎఫ్ఎంఎస్) పేరుతో మూడు సంవత్సరాల కాల వ్యవధితో ఏజెన్సీలను ఎంపిక చేసే విధానం అమలు జరుగుతుందని ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీలు కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర గడుస్తున్న వాటిని రద్దు చేయకుండా పాత ఏజెన్సీల వారికే అనుమతులు పెంచుతూ పోవడం సబబు కాదని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా కార్మికులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మోయలేని పని భారంతో తీవ్రమైన అనారోగ్యాలకు కార్మికులకు గురవుతున్నారని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఆసుపత్రి ఎంతో నూతన భవనాలు కొత్త కొత్త వార్డులు నెలకొల్పబడుతున్న వాటికి అనుగుణంగా కార్మికుల సంఖ్య మాత్రం పెరగటం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరిగా నెల మొదటి రోజే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వేతనాలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు జరగడంలేదని అన్నారు. కార్మికులపై తప్పుడు ఆరోపణలు వేధింపులు సరికాదని అన్నారు. ప్రభుత్వం ఏజెన్సీల విధానం రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా వేతనాలు అందించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26 వేలకు పెంచుతూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎస్. సంతోష్, ఆస్పత్రి మెడికల్ కళాశాల బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు గోవర్ధన్ రెడ్డి, కర్ణాకర్, రాము, వెంకటేష్, రాజు, యం.వెంకటేష్ , రమేష్, ఖాధర్, రాజలింగం, మధు, శ్రీను, ప్రవీణ్, భీమీరెడ్డి, రాములమ్మ, గోవిందమ్మ, అంబిక, చెన్నమ్మ, యం.కవిత, అనురాధ, అనిత, అశ్విని, భూదేవి, సత్యమ్మ, రాధా, శ్వేత, అనాంద, సంద్య పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.*