కీసర శ్రద్ధ కళాశాలలో వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు.!
పూల పండుగలో భాగంగా బతుకమ్మకు ప్రత్యేక పూజలు
ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి
అతిథులను ఘనంగా సన్మానించిన కళాశాల చైర్మన్ ఎం.డి. మధార్
కీసర, మేజర్ న్యూస్, (అక్టోబర్10):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కీసరలోని శ్రద్ధ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో బతుకమ్మను అందంగా పేర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూల పండుగ వేడుకలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీసర డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎం.డి. మధార్ అతిథులను ఘనంగా సన్మానించారు.అనంతరం అతిథులు బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనం గురించి వివరించారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పూల పండుగ అని, మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలను విద్యాసంస్థల్లో నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.కళాశాలలో ప్రతి పండుగను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న యాజమాన్యాన్ని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నింపగా, విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.