జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
జిన్నారం :జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయదశమి వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అర్చనలు నిర్వహించడంతో ఆలయంలో భక్తిశ్రద్ధలు వెల్లివిరిశాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, రక్షాకంకణ ధారణ, అష్టోత్తర శతనామ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు జిన్నారం పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామానికి చెందిన పలువురు పిల్లలు, యువకులు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దీక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శేరికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. భక్తులు అమ్మవారి సేవలో పాల్గొని ఆ జగన్మాత కృపకు పాత్రులు కావాలని కోరారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు, కుంకుమార్చన పూజలు విశేషంగా కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
జిన్నారంలో....
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తాబేలు గుట్టపై వెలసిన జీవన జ్యోతిర్లింగ శివాలయంలోని అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. ఉత్సవాల నేపథ్యంలో సకల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బుక్క శ్రీకాంత్ తెలిపారు. భక్తులు నవరాత్రులలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అలాగే ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.