జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం!
జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం!
ఘనంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నారాయణఖేడ్ డివిజన్ 3వ మహాసభ
జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం నిరంతరం కృషి చేస్తాం
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్నాయకుల పిలుపు.
నారాయణఖేడ్, : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నారాయణఖేడ్ డివిజన్ 3వ మహాసభ డివిజన్ కార్యదర్శి కైసర్,మనిక్ ప్రభు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ మహాసభలో ఆక్టివ్అధ్యక్షుడు రామచందర్, ఉపాధ్యక్షులు గుడిగంట రఘు, రాజశేఖర్, మేకల కృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పండు, జాతీయ కౌన్సిల్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సిలంకోటి సురేందర్ సంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు రాజ గౌడ్ లు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించడం తగదన్నారు.అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు సైతం సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, వృత్తి నిర్వహణలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టే ప్రతి కార్యక్రమంలో సభ్యులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంఘాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు.జర్నలిస్టుల ఐక్యతే సంఘానికి బలం.. హక్కుల సాధనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు.