ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
ఘట్కేసర్ రూరల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14) : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ అన్నోజిగూడ ఎల్ఐజీ కాలనీ సమీపంలోని సర్వే నంబర్ 10/పి వద్ద నిర్మించనున్న 480 ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు డ్రా విధానంలో పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తామని, కులం, మతం, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. 2027 బతుకమ్మ పండుగ నాటికి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తామని, రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా బ్యాంకుల ద్వారా రూ.25 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరి, హౌసింగ్ బోర్డు ఎండీ వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: లంబ రాజు, ఘట్కేసర్ రూరల్, మేడ్చల్ జిల్లా.