ట్యాంకర్ల నీటితో వరి పంటను కాపాడుకుంటున్న రైతు
ట్యాంకర్ల నీటితో వరి పంటను కాపాడుకుంటున్న రైతు
వర్షాభావం.. ఎండిన బోర్లు.. విద్యుత్ కోతలతో అన్నదాతకు ఇక్కట్లు
వర్షాలు లేక, భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోవడంతో వరి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు నానా అవస్థలు పడుతున్నాడు.రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామానికి చెందిన రైతు రావుల కృష్ణ రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నీరు అందకపోవడంతో ప్రతిరోజూ ఆరు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసి పొలానికి అందిస్తున్నాడు.
ఒక్కో ట్యాంకర్కు రూ.800 చొప్పున రోజుకు రూ.4,800 ఖర్చు చేస్తున్నాడు. పంటను బతికించుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో అప్పుల పాలవుతున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
దీనికితోడు రోజుకు నాలుగైదు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బోర్ల ద్వారా నీరు అందించలేకపోతున్నాడు. పంటకు అవసరమైన సమయంలో నీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతు, చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు అప్పులు చేస్తూ ట్యాంకర్ల నీటిపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి
వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల కొరత, విద్యుత్ కోతలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు గుర్తించి, సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు