కాటారం తహసిల్దార్ కార్యాలయంలో కూలిన సీలింగ్-తృటిలో తప్పిన పెను ప్రమాదం
కాటారం, మేజర్ సూర్య:
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నాడు పెను ప్రమాదం తృటిలో తప్పింది. తహసీల్దార్ కూర్చునే ప్రధాన ఛాంబర్లో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. భారీ శబ్దంతో ఫ్యాన్తో సహా సీలింగ్ మొత్తం కింద ఉన్న కంప్యూటర్ల పై కూలిపోయింది.ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది విధుల్లో భాగంగా గది తలుపులు తెరిచి చూడగా ఈ దారుణ దృశ్యం వెలుగుచూసింది. నిత్యం తహసీల్దార్ ఆసీనులయ్యే కుర్చీ, టేబుల్పైనే ఈ సీలింగ్ శిథిలాలు పడి ఉండడంతో సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో తహసీల్దార్ గానీ, ఇతర సిబ్బంది గానీ గదిలో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఆఫీస్ వేళల్లో గనుక ఈ ఘటన జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం సంభవించేదని, దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత భవనంలో పలుచోట్ల పైకప్పు పెచ్చులు ఊడిపోతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చే ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. కేవలం ఈ కార్యాలయమే కాకుండా, మండలంలోని పలు ప్రభుత్వ భవనాల పరిస్థితి ఇలాగే శిథిలావస్థకు చేరిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్: గోనే సుధాకర్ రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాలపల్లి