గుమ్మడవెల్లిలో ఘనంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు
గుమ్మడవెల్లిలో ఘనంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు
ఆటపాటలు, కోలాటాలతో సందడిగా సంబరాలు
కందుకూరు మండలంలోని గుమ్మడవెల్లి గ్రామంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కురుమ సంఘం, గౌడ సంఘం, గ్రంథాలయం, శ్రీ సిద్ధి వినాయక యూత్‌తో పాటు వివిధ వాడల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, కోలాటాలతో సందడి చేశారు. డీజే పాటలతో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.
రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి
ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ గౌర ప్రభాకర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. గ్రామంలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగితే భవిష్యత్తు తరాలకు మంచి పునాది వేసినవారమవుతామని పేర్కొన్నారు. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సస్యశ్యామలం చేసుకోవచ్చని తెలిపారు.